కందనూలు: జిల్లాలో బక్రీద్ పండుగ కోసం మసీదులు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రం శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు మత పెద్దలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
● ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పండుగ మనిషిలో మానవత్వాన్ని, పరస్పర సహకారాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గొప్ప సందేశాన్ని అందిస్తుందన్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుతూ పరస్పర గౌరవభావంతో మెగాలని ఆకాంక్షించారు.
సమన్వయంతో
పనిచేయాలి
కందనూలు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న వేడుకల కోసం ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. వేడుకల ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.
మహిళలు చట్టాలపై
అవగాహన పెంచుకోవాలి
కందనూలు: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కరపత్రాలు విడుదల చేసి పోష్ చట్టం, షీబాక్స్ పోర్టల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు పోష్ చట్టం చాలా ఉపయోగపడుతుందని, ప్రతి మహిళా ఉద్యోగి చట్టంలోని నిబంధనలు తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, సఖి అడ్మినిస్ట్రేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓగా ఆర్.పాండు
కందనూలు: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)గా ఆర్.పాండును నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై బదిలీలో భాగంగా నాగర్‌కర్నూల్ డీఆర్‌ఓగా రానున్నారు. త్వరలోనే ఈయన బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.
అక్రమ కేసులకు
భయపడొద్దు
బల్మూర్: కాంగ్రెస్ నాయకుల అక్రమ కేసులు, దాడులకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భయపడొద్దని, వారికి పార్టీ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామంలో ఇటీవల బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపిస్తూ బుధవారం కార్యకర్తల భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు నాగర్‌కర్నూ ల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే లు, నాయకులు పోలీసులతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేయిస్తున్నారని, తిరిగి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ మని అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, నాయకులు తులసీరాం, మనోహర్, కరుణకర్‌రావు, పర్వతాలు, నాగరాజు, రమేష్‌రావు, శివ, బాలరాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


