కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్మాణ్ సంస్థ, జిల్లా ఎంప్లాయిమెంట్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఇన్ఫోసిస్ ఆర్థిక సహకారంతో, నిర్మాణ్ సంస్థ, క్వీన్ క్రాప్ భాగస్వామ్యంతో 15 పైగా కంపెనీలు పాల్గొన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు 200మందికి పైగా అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి.. అర్హులైన వారికి కంపెనీల ఆఫర్ లెటర్లు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ అధికారిణి డా.దీపిక, ఎంప్లాయిమెంట్ అధికారి రాఘవేంద్ర సింగ్, అధ్యాపకులు కృష్ణయ్య, ధర్మ, రవీందర్ పాల్గొన్నారు.
అమర్నాఽథ్ యాత్రికులకు వైద్యపరీక్షలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి యాత్రికులకు పలు సూచనలు చేశారు. యాత్రలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వైద్యపరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆమె అందజేశారు. కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మోనాదేవి, డా.నిఖిత, సహాయ సంచాలకులు సీజే వసంత్ కుమార్, ఆర్‌ఎంఓ డా.ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల, పద్మ, హెల్ప్‌డెస్క్ ఇన్‌చార్జి టి.యాదగిరి పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి 92మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా కొనసాగాయి. రెండో రోజు జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో ఆంగ్లం పరీక్ష నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 1,160 మందికి గాను 1,091 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 970 మందికి గాను 916 మంది, ఒకేషనల్ విభాగంలో 190 మందికి గాను 175 మంది హాజరై పరీక్ష రాశారు. అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 216 మందికి గాను 203 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 124 మందికి గాను 117 మంది, ఒకేషనల్ విభాగంలో 92 మందికి గాను 86 మంది హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 69 మంది, ద్వితీయ సంవత్సరంలో 23 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
కూలీలకు అన్ని వసతులు కల్పించాలి
కోడేరు: ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపాధిహామీ పథకం పనులు చేపట్టే ప్రదేశాల్లో కూలీలకు నీడ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించడంతో పాటు మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు సూచించారు. గురువారం కోడేరు మండలం నాగులపల్లిలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పలు సూచనలు చేశారు. ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 6 గంటలకే పనులకు వచ్చి.. మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ సిబ్బంది తప్పనిసరిగా కూలీల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఈసీ సరిత ఉన్నారు.


