● తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో
వేగం పెంచాలి
● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
కందనూలు: గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం ఊర్కొండ మండలం రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం మంజూరుచేసిన ఇళ్లను త్వరగా నిర్మించుకొని గృహప్రవేశాలు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీరోడ్ల నిర్మాణాలు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా పైప్‌లైన్ వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సీసీరోడ్ల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. అభివృద్ధి పనుల నాణ్యతా విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని.. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
రాచాలపల్లి గ్రామంలో వరిధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల వద్దకు కలెక్టర్ వెళ్లి పంట దిగుబడి, ధాన్యం నాణ్యత, కొనుగోలు కేంద్రానికి తరలింపు ఏర్పాట్లపై ఆరా తీశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కలెక్టర్.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం, హౌసింగ్ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్ యూసుఫ్ అలీ తదితరులు ఉన్నారు.


