భీమా కాల్వ గండి పూడ్చాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

భీమా కాల్వ గండి పూడ్చాల్సిందే..

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

సాగునీటి విషయంలో అలసత్వం వహిస్తే సహించం

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌ రూరల్‌: వీపనగండ్ల మండలం నాగార్లబండ తండా సమీపంలో తెగిపోయిన రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్యాకేజీ–16 ప్రధాన కాల్వకు సత్వరమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. నాగార్లబండ తండా సమీపంలో 62.25 కి.మీ. వద్ద భీమా కాల్వకు 2019 జూలై 23న గండి ఏర్పడగా.. నేటికీ శాశ్వత మరమ్మతులు పూర్తికాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఈపీసీ ఒప్పందం మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇంకా అధికారికంగా ముగియలేదని.. ఈ క్రమంలో గండిని పూడ్చడంతో పాటు ఇతర పెండింగ్‌ పనులను పూర్తిచేయాల్పిన బాధ్యత సంబంధిత గుత్తేదారుదేనని ఆయన స్పష్టం చేశారు. మరమ్మతు పనుల్లో ఆలస్యం కావడానికి గల కారణాలు.. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విషయంలో రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ నమస్యపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదలశాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు ఆయన వెల్లడించారు. భీమా కాల్వ మరమ్మతుకు అవసరమైన పరిపాలనా అనుమతులను త్వరలోనే ఇప్పిస్తామన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలుగకుండా యుద్దప్రాతిపదికన కాల్వ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈలు వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్‌, భీమా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కేశవరావు, డీఈ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement