జిల్లాలో ఇదీ పరిస్థితి..
కొనుగోళ్లు చేపడుతున్నాం..
మొక్కజొన్న అమ్ముకునేందుకు అష్టకష్టాలు
● కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు
● లారీలు, హమాలీల కొరతతో
పేరుకుపోతున్న నిల్వలు
● అకాల వర్షాలతో రైతుల ఆందోళన
జిల్లా కేంద్రంలోని నెల్లికొండ
మార్కెట్‌యార్డు కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం బస్తాలు
కందనూలు: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నను విక్రయించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం.. ప్రారంభించిన చోట నామమాత్రంగా కొనుగోళ్లు సాగడంతో రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు కొనుగోలుచేసిన ధాన్యాన్ని సైతం సకాలంలో తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కొందరు రైతులు రహదారులు, పొలాలు, మైదాన ప్రాంతాల్లోనే ఇంకా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు, ఏ సమయంలో వర్షం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు చేసేదిలేక ఎంతకో అంతకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.
ధాన్యం తరలించడంలో జాప్యం..
రైతులు మక్కజొన్నను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం ఒక ఎత్తయితే.. ధాన్యాన్ని అమ్మడం, అమ్మిన బస్తాల వద్ద కాపలా కాయడం మరో ఎత్తుగా మారింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గోదాముల వద్ద లారీల నుంచి బస్తాలను అన్‌లోడ్ చేసేందుకు హమాలీల కొరత ఉండటంతో కేంద్రాల వద్ద తూకం వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి.
హమాలీల చేతివాటం..
మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్ల బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించింది. అయితే కొందరు హమాలీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక బస్తా ధాన్యం నింపి, లోడింగ్ చేయడానికి రూ. 30 నుంచి రూ. 40 వసూలు చేస్తున్నారు. కొంచెం లారీ దూరంగా ఉన్నట్లయితే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా 2లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేయగా.. ధాన్యం సేకరణ కోసం 15 కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 3లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఉండగా.. ఇప్పటివరకు 68వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రోజుకు 16 లారీల చొప్పున ధాన్యాన్ని తరలిస్తున్నట్లు మార్కెఫెడ్ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం. ఒకే సారి రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తేవడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. లారీలు, హమాలీల సమస్యతోనూ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యను అధిగమిస్తున్నాం. 2, 3 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం.
– తహమినీ, జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి


