● రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు,
యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
● మెగా జాబ్‌మేళాలో పాల్గొన్న
105 కంపెనీలు
● ఉమ్మడి జిల్లా నుంచి 3,450
మంది నిరుద్యోగుల హాజరు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ జాబ్‌మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు.
ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్‌నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్‌లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్‌లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్‌మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు.
నియామక
పత్రాల అందజేత
ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్‌కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్‌నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


