ఇసుక అక్రమ రవాణాను సహించం | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాను సహించం

Mar 24 2026 8:38 AM | Updated on Mar 24 2026 8:38 AM

కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరంలో ఇసుక అక్రమ తవ్వకం, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై ఎస్పీ డా.సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, అదనపు కలెక్టర్లు అమరేందర్‌, జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌తో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక బుకింగ్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ‘మన ఇసుక వాహనం’ ద్వారానే జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ అనుమతించబడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలోని 15 రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు పూర్తిగా ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారానే తరలించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇటీవల నంబర్‌ ప్లేట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను గుర్తించిన నేపథ్యంలో అలాంటి వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఇసుక వాహనాలు కనిపిస్తే.. వెంటనే వాటిని సీజ్‌ చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను మరింత కఠినతరం చేయాలని.. రాత్రి వేళల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రతి ఇసుక రీచ్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేశామని.. అవసరమైతే డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని.. గృహ అవసరాల కోసం ఇసుకను పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. అదే విధంగా వివిధ శాఖల అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించడానికి మైనింగ్‌, రెవెన్యూ శాఖల సమన్వయంతో పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement