చారకొండ: డిండి – నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోకారం వద్ద నిర్మించే రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాను ముంపు ముప్పు నుంచి కాపాడాలని నిర్వాసితులు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి.. ఎర్రవల్లి, తండాను కాపాడాలని కోరుతూ రిలే నిరహార దీక్షలు చేపట్టి వంద రోజులు దాటినా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ.. పార్లమెంట్ సమావేశాల అనంతరం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సీఎంతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో మాజీ వైస్‌ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు ప్రకాశ్, శ్రీరాములు, వెంకటేశ్, శేఖర్, పర్వతాలు, పెద్దయ్య ఉన్నారు.


