చారకొండ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దుచేసి.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పరిరక్షించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ డిమాండ్ చేశారు. చారకొండ మండలం జూపల్లిలో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. కొత్త చట్టం కూలీల హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. కూలీలకు పనిదినాలను పెంచి.. రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జూపల్లిలో నిర్వహించే మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ జగపతి అనూష, నాయకులు ఆంజనేయులు, నర్సింహ, బాలస్వామి, ఎస్.మల్లేష్, నాగరాజు, సైదులు, శివుడు, వెంకటయ్య, సత్యనారాయణ, మధు ఉన్నారు.
‘గణపసముద్రం’ పనులు అడ్డుకున్న రైతులు
ఖిల్లాఘనపురం: గణసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన అన్నదాతలకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలంటూ ఆదివారం మండల రైతులు పనులు అడ్డుకున్నారు. పనులు చేపడుతున్నట్లు తెలుసుకున్న రైతులు ముంపు రైతుల కమిటీ అధ్యక్షుడు నల్లమద్ది రవీందర్‌రెడ్డికి తెలియజేశారు. ఆయన కొందరు రైతులతో కలిసి రిజర్వాయర్ దగ్గరకు చేరుకొని పనులు నిలిపివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ పరిహారం వెంటనే చెల్లిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్పట్లో చెప్పారని.. రైతులు భూముల వివరాలు ఇవ్వడంతో పాటు సంతకాలు చేసి 8 నెలలు గడుస్తున్నా నేటికీ చెల్లించడం లేదని వివరించారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని, అప్పటి వరకు నిలిపివేయాలని కోరడంతో నిలిపివేశారు.


