నేటినుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ
● మూడు విడతల్లో అందనున్న పెట్టుబడి సాయం
● ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్న ప్రభుత్వం
● జిల్లాలో 3.41 లక్షల మందికి ప్రయోజనం
● ఫ్రిబవరి 28 వరకు పాస్‌బుక్ పొందినవారు అర్హులు
●
ఆనందంగా ఉంది..
రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు తమ ఖాతాల్లో ఆదివారం నుంచి జమ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొంత ఆలస్యమైనా డబ్బులు వేయడం సంతోషం. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులను తీర్చడానికి అవకాశం ఉంటుంది. – శివకుమార్, రైతు,
పెద్దూరు, తెలకపల్లి మండలం
అర్హులందరికీ
జమవుతాయి..
అర్హులైన రైతులందరికీ ఆదివారం నుంచి రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా ఎకరం డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. కొత్త పాసు పుస్తకాలు పొందిన రైతులు ఏఈఓలకు వివరాలు అందజేయాలి. రైతులు ఖాతా నంబర్ మార్చుకోవాలన్నా, ఇతర సమస్యలున్నా వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
– యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
కందనూలు/ అచ్చంపేట: యాసంగి రైతు భరోసాకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. గడిచిన వానాకాలంలో భూ విస్తీర్ణం ఆధారంగా తొమ్మిది విడతలుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందించగా.. ఈసారి మూడు విడతల్లోనే జమ చేయనున్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున తొలి విడతలో ఎకరా వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రెండో విడత మరో 20 రోజులకు, మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన ఈ నిధులను చాలా ఆలస్యంగా పంటలు చేతికి వచ్చే దశలో ప్రభుత్వం అందిస్తోంది. వరుస ఎన్నికలు, నిధుల లేమితో ఆలస్యం కాగా.. ఇప్పటికై నా నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సాగు భూములు కాకున్నా చాలామంది పెట్టుబడి సాయం పొందారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సాగు భూముల లెక్క తేల్చారు. జిల్లాలో 142 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టగా జిల్లాలో 7,752 ఎకరాల భూమి అసలు సాగుకే పనికిరాదని, కొన్ని స్థలాల్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్, క్వారీలు, ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్లు, మిల్లులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కోళ్ల ఫారాలు, రహదారులు, గోదాంలు, ఇళ్లు తదితరాలున్నట్లు గుర్తించారు. అలాగే పలు ప్రాంతాల్లో భూస్వాములు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఇతరత్రా వాటికి దానంగా, ఇనాంగా ఇచ్చారు. కాలక్రమంలో వాటిని మ్యూటేషన్ చేయకపోవడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో వారి పేరే నమోదైంది. సర్వేలో గుర్తించిన సాగుకు యోగ్యం కాని భూములకు చెందిన సర్వే నంబర్లతో విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్‌లో ఫ్రీజింగ్ చేశారు.
కొత్త మార్గదర్శకాలు ఇలా..
ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు ఎకరాలోపు ఉన్న రైతులకే మొదటి విడతలో డబ్బులు జమ అయ్యేవి. కానీ, ఈసారి ఎకరా కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా మొదటి విడతలో ముందుగా రూ.6 వేలు జమ చేయనుంది. అలాగే కొత్తగా పట్టా పాసుపుస్తకం వచ్చిన రైతుల ఖాతాల్లోనూ పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 28 వరకు పట్టా పాస్ బుక్‌లు పొందిన రైతులు ఏఈఓలకు పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను ఈ నెల 25 వరకు అందజేయాల్సి ఉంటుంది.
ఆ భూములకు రాదు..
8.30 లక్షల ఎకరాలు..
జిల్లాలో సాగుకు అనుకూలమైన భూములు 8.30 లక్షల ఎకరాలు ఉన్నాయి. అందులో జిల్లావ్యాప్తంగా గత సీజన్‌లో 3,00,698 మంది రైతులు రూ.415.23 కోట్ల రైతు భరోసా అందుకున్నారు. కాగా ఈ సీజన్‌లో 3,41,072 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వారికి ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.440,24,27,602 ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఎకరం నుంచి ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులు 3,14,946 మందికి గాను రూ.324.63 కోట్లు, 6 నుంచి 10 ఎకరాలలోపు ఉన్న 21,760 మందికి రూ.78.28 కోట్లు, 11 నుంచి 20 ఎకరాలు ఉన్న 2,865 మందికి రూ.26.28 కోట్లు, 21 ఎకరాల పైన ఉన్న రైతులు 1,501 మందికి రూ.11.32 కోట్లు వారి ఖాతాల్లో జమకానున్నాయి.


