నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆందోళన
కొల్లాపూర్ రూరల్: పట్టణంలోని పీజీ కళాశాల వసతిగృహంలో మెనూ పాటించకపోవడంతో పాటు నాసిరకం భోజనం అందిస్తున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్‌లో వండిన భోజనంతో పీజీ కళాశాల ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కళాశాల హాస్టల్‌లో కొంతకాలంగా మెనూ అమలు చేయకపోవడంతో పాటు నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నెలరోజుల క్రితం ప్రిన్సిపాల్‌కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నాణ్యత లేని భోజనం తిని గత నెల 26న ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వాపోయా రు. తమకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇకపై మెనూ ప్రకారం భోజనం అందిస్తామని ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్ విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆది మద్దతు తెలిపి పాల్గొన్నారు.


