మిగిలింది.. రెండు రోజులే
సాక్షి, నాగర్‌కర్నూల్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలిఉంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. తొలి విడతలో భాగంగా జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని 151 సర్పంచ్, 1,326 వార్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఎన్నికల ప్రచారానికి కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో తొలి విడత గ్రామాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
గెలుపే లక్ష్యంగా హామీలు..
గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు కుల, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గెలుపు కోసం భారీస్థాయిలో హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు వ్యక్తిగత పనులపై సైతం హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా ఓటర్ల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
వైన్‌షాపులు బంద్..
తొలి విడత ఎన్నికల నేపథ్యంలో 48 గంటల ముందుగానే వైన్‌షాపులు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి వైన్‌షాపులను మూసివేయనున్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి పూర్తయ్యే వరకు వైన్‌షాపులను మూసివేసి ఉంచనున్నారు. వైన్‌షాపుల మూసివేత నేపథ్యంలో పలు గ్రామాల అభ్యర్థులు ఇప్పటికే భారీ స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేసి డంపులుగా నిల్వ చేసుకుంటున్నారు.
నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం
అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్
గ్రామాల్లో జోరుగా ప్రలోభాల పర్వం
11న పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి


