పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Dec 11 2025 9:33 AM | Updated on Dec 11 2025 9:33 AM

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం 6వేల మందికి పైగా అధికారులు వివిధ హోదాల్లో విధులు నిర్వరిస్తున్నట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లో 151 జీపీలకు మొదటి విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 14 జీపీల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవయ్యాయని.. మిగిలిన 137 సర్పంచ్‌ స్థానాల్లో 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. అదే విధంగా 1,326 వార్డులకు గాను 208 వార్డులు ఏకగ్రీవమయ్యాయని.. 1,118 వార్డు స్థానాల్లో 2,774 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు వివరించారు. కల్వకుర్తి మండలంలో 24 జీపీలు, 214 వార్డులకు గాను పురుష ఓటర్లు 15,803, మహిళా ఓటర్లు 15,703 మంది ఉన్నారన్నారు. ఊర్కొండ మండలంలో 16 జీపీలు, 138 వార్డులకు గాను పురుషులు 8,868 మంది, మహిళా ఓటర్లు 9,119 మంది, వంగూరు మండలంలో 27 జీపీలు, 228 వార్డులకు గాను పురుషులు 16,498 మంది, మహిళా ఓటర్లు 17,000 మంది, వెల్దండ మండలంలో 32 జీపీలు, 270 వార్డులకు గాను పురుషులు 17,163 మంది, మహిళా ఓటర్లు 16,995 మంది, తాడూరు మండలంలో 24 జీపీలు, 216 వార్డులకు గాను పురుషులు 14,968 మంది, మహిళలు 15187 మంది, తెలకపల్లి మండలంలో 28 జీపీలు, 260 వార్డులకు గాను పురుషులు 22,325 మంది, మహిళా ఓటర్లు 22,520, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆయా మండలాల్లో పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించే అధికారులు, సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నేడు వేతనంతో కూడిన సెలవు

మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ జరిగే మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించిందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన వెసులుబాటు కల్పించాలని సూచించారు. కాగా, ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 10, 11 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్‌ సంతోష్‌ కోరారు. జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ పాస్‌పుస్తకం, కార్మిక మంత్రిత్వశాఖ ఇచ్చిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువపత్రాలు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, ఫొటోతో కూడిన పెన్షన్‌ డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, రేషన్‌ కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్స్‌ పత్రం, ప్రీడమ్‌ ఫైటర్‌ గుర్తింపు కార్డు, ఆర్టీఐ జారీచేసిన ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డు వంటి వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement