పోలింగ్ విధులుపక్కాగా నిర్వర్తించాలి
కల్వకుర్తి రూరల్/వెల్దండ: పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కల్వకుర్తి మండల పరిషత్ కార్యాలయం, వెల్దండలోని మోడల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. వెల్దండ మండలంలో సమస్యాత్మక గ్రామాలుగా అజిలాపూర్, భైరాపూర్, బొల్లంపల్లి, చెదురుపల్లి, చెర్కూర్, కుప్పగండ్ల, పెద్దాపూర్, పోతేపల్లిని గుర్తించినట్లు తెలిపారు. ఆమె వెంట నోడల్ అధికారి సీతారాం, ఎంపీడీఓలు వెంకట్రాములు, సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం తదితరులు ఉన్నారు.
‘గోకారం’పై మొండివైఖరి తగదు
చారకొండ: డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించాలని ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరించడం తగదని నిర్వాసితులు అన్నారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించాలని పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడంతో పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలి
అచ్చంపేట రూరల్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు తర్వాతి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గాజుల వెంకటేశ్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు విడుతల్లో ఎన్నికల విధుల బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. తీరిక లేకుండా కష్టతరమైన ఎన్నికల విధులు నిర్వహించడం ద్వారా ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తర్వాతి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరారు.
పరీక్ష ఫీజు
చెల్లించండి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు థియరీ సబ్జెక్టులకు ఎస్సెస్సీ విద్యార్థులు రూ.100, ప్రాక్టికల్స్‌కు రూ.100, ఇంప్రూమెంట్‌కు రూ.200 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ వారు థియరీ సబ్జెక్టులకు రూ.150, ప్రాక్టికల్స్‌కు రూ.150, ఇంప్రూమెంట్‌కు రూ.350 చెల్లించాలని సూచించారు.
పోలింగ్ విధులుపక్కాగా నిర్వర్తించాలి


