900 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
● నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
● ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్
నాగర్‌కర్నూల్ క్రైం: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మున్ననూర్ వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు, బిజినేపల్లి మండలం మంగనూరులో జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు, వెల్దండ మండలం కొట్ర క్రాస్‌రోడ్డు వద్ద జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.1,53,000 నగదు సీజ్ చేయడంతో పాటు బెల్టుషాపుల్లో దాడులు నిర్వహించి.. 1,470 లీటర్ల మద్యం సీజ్ చేసి, 150 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. పట్టుబడిన మద్యం విలువ రూ.6,90,522 ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లు, పాత నేరస్తులు 834 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. లైసెన్స్ కలిగిన 22 ఆయుధాలను జిల్లా ఆయుధ కారాగారంలో డిపాజిట్ చేయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా 900 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు ఎస్‌ఎస్‌టీ, 20 ఎఫ్‌ఎస్‌టీ బృందాలతో పాటు అడిషనల్ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు , 44 మంది ఎస్‌ఐలు, 168 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్ ర్యాంక్ అధికారులు, 520 మంది కానిస్టేబుల్స్, 100 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచామని.. విద్వేష పూరిత పోస్టులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలను పోస్ట్ చేసిన, షేర్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.


