గ్రామాల అభివృద్ధిని కోరుకోండి
● పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్
మద్దతుదారులకు అండగా నిలవాలి
● డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధిచేసే వారినే ఎన్నుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, వడ్డీలేని రుణాలు, రైతుభరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ, రూ. 500కే సిలిండర్ తదితర పథకాలను అమలుచేస్తున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు సులభతరమవుతాయని చెప్పారు. గ్రామస్వరాజ్యం స్ఫూర్తితో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. ఆర్థిక వ్యవస్థను బలపరుస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మనస్పర్థలు వీడి.. పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులకు ప్రభుత్వం తరఫున శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాకేంద్రంలో ఇప్పటివరకు రూ. 40కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు వివరించారు. జనరల్ ఆస్పత్రి నూతన భవనం శంకుస్థాపన దశలో ఉందని.. జూనియర్ కళాశాల భవనం, నూతన బస్టాండ్ తదితర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు తీగల సునేంద్ర, కావలి శ్రీనివాసులు, నిజాం తదితరులు ఉన్నారు.


