ఎన్నికల విధుల్లో నిబద్ధతతో వ్యవహరించాలి
నాగర్‌కర్నూల్/ తాడూరు: పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించడం ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యత అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు నిర్వహణ, ఓటింగ్ పద్ధతులు, నిబంధనలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది తమ పాత్ర ఎంత ముఖ్యమో గ్రహించి, శిక్షణలో నేర్చుకున్న ప్రతి దాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెలుతురు ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ప్రక్రియను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలను సజావుగా నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, గెలుపొందిన వార్డు సభ్యుల సమక్షంలో ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. అనంతరం తాడూరులోని ఎమ్మార్సీ భవనంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంపీఓ ప్రశాంత్, తహసీల్దార్ రామకృష్ణయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్‌ఐ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.


