స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగం
నాగర్‌కర్నూల్ క్రైం: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్‌తో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, ప్రతి ఓటరు భయపడకుండా, స్వేచ్ఛగా ఓటువేసే వాతావరణం కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల పరిస్థితిని అధ్యయనం చేసిన డీఐజీ ప్రత్యేక బృందాల గస్తీ, రాత్రివేళలో నిఘా, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణపై మరింత దృష్టి అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన, విద్వేషపూరిత పోస్టులు, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా సమస్యలు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణ, బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు, రౌడీషీటర్ల కదలికలపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, చట్టవిరుద్ధ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


