సీపీఎం మద్దతుదారులతోనే గ్రామాల అభివృద్ధి
నాగర్‌కర్నూల్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఓడించి మతోన్మాద చర్యలను తిప్పికొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాగర్ అన్నారు. గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రశాంతంగా ఉన్న గ్రామాలను అశాంతిలోకి నెట్టుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందలేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాపురించిందన్నారు. గ్రామాలు ప్రశాంతంగా అభివృద్ధి వైపు నడవాలంటే సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు, దేశనాయక్, గీత, ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, నర్సింహ, శంకర్‌నాయక్, బాలస్వామి, అశోక్, శివవర్మ, నాగరాజు, తారాసింగ్, మధు పాల్గొన్నారు.


