వేలం.. ‘ఏకగ్రీవం’!
సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ
● పలు పల్లెల్లో గ్రామస్తుల మూకుమ్మడి కార్యాచరణ
● చక్రం తిప్పుతున్న పెద్దలు..
ఉమ్మడి జిల్లాలో పెరిగిన సంస్కృతి
● వేలం పాట నేరమంటున్న అధికార యంత్రాంగం
● శిక్ష తప్పదంటూ బస్వాపూర్ ఘటనను ఉదహరిస్తూ హెచ్చరికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలు కాగా.. తొలి రోజే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పలు జీపీల్లో ఆలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తదితర అభివృద్ధి పనుల పేరిట ‘పెద్దలు’ చక్రం తిప్పుతూ బహిరంగ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. రేటు ఫిక్స్ చేసి మరి పోటీ లేకుండా మూకుమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవ ఆఫర్లు ప్రకటించగా.. ఔత్సాహికులూ అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ లెక్కన గతంతో పోల్చితే వేలం పాటల సంస్కృతి ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేరమంటున్న అధికారులు..
పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలు.. ఏదైనా వేలం పాట నిర్వహించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం చట్ట విరుద్ధమంటున్నారు. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం చెదిరిపోకుండా ఉండడంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికంగా రూ.10 లక్షలు ఇస్తుందని.. అలా అని డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే శిక్షార్హులవుతారని వివరిస్తున్నారు. 2013 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్‌లో ఈ విధంగా వేలం పాట దక్కించుకున్న వారి ఎన్నిక చెల్లలేదని.. దీంతో పాటు వేలం నిర్వహించిన పెద్దలు, వేలం పాడిన వ్యక్తి జైలు పాలయ్యారని ఉదహరిస్తున్నారు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పాట పాడి.. వాయిదా వేసి..
గట్టు మండలం అరగిద్ద గ్రామ సర్పంచ్‌కు వేలం నిర్వహించగా.. ఓ గ్రామ నాయకుడు రూ.35 లక్షల వరకు వేలం పాడారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగలడంతో వేలం పాటను పెద్దలు శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
అంతంపల్లిలో సైతం సర్పంచ్ పదవికి రూ.24 లక్షలకు వేలం పాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయాడు. దీంతో పెద్దలు వేలాన్ని నిలిపివేసినట్లు సమాచారం. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


