సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
కందనూలు: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేజీబీవీల పర్యవేక్షణ అధికారి శోభారాణి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఊర్కొండ కేజీబీవీ విద్యార్థులు సాంకేతిక రంగాల్లో మరింత ప్రతిభను పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత విద్యా సమాచారంతోపాటు సబ్జెక్టులలో ప్రమాణాలను పెంచుకునేలా జిల్లాలోని కేజీబీవీల విద్యార్థులకు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ.. టీ–స్టెమ్ (తెలంగాణ– సైన్స్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్) కార్యక్రమంతో మరింత పరిజ్ఞానాన్ని అందించే విధంగా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 20 కేజీబీవీల విద్యార్థులకు వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రభుత్వ కళాశాలల్లో, ఇతర విద్యా సంస్థలలోని వృత్తి సంబంధిత ప్రయోగశాలల వసతులను మ్యాపింగ్ చేయడం, విద్యార్థులు వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5ఏ వంటి సాంకేతిక అంశాలపై విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి పాల్గొన్నారు.


