పకడ్బందీగా నిర్వహించాలి
తాడూరు: ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియను గురువారం తాడూరులో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ సంబంధించిన 151 సర్పంచ్‌లు, 1,326 వార్డు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్లు చెప్పారు. తాడూరు గ్రామ సర్పంచ్, 12 వార్డులకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో చేపడుతున్న నామినేషన్ల ప్రక్రియపై ఆరా తీసి ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థులు ప్రతిపాదకుడి సాయం, నిర్ణీత రుసుం చెల్లించి నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. ఆదివారం పరిశీలన తర్వాత సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటు అయ్యే జాబితా ప్రకటిస్తామని, నామినేషన్ల తిరస్కరణకు గురైన వారు డిసెంబర్ 1న అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎన్నికల అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస ఆచార్య తదితరులు పాల్గొన్నారు.


