సర్వం సిద్ధం..
సాక్షి, నాగర్‌కర్నూల్: గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. తొలి విడత నామినేషన్లు గురువారం నుంచే ప్రారంభంకానున్నాయి. జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని మొత్తం 151 సర్పంచ్, 1326 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నాలు గు, ఐదు గ్రామపంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 46 క్లస్టర్లు ఏర్పాటుచేశారు. ఆయా క్లస్టర్ కేంద్రాల్లోనే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
చెక్‌పోస్టుల ఏర్పాటు..
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం, పోలీసులు కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా నలుమూలల చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కల్వకుర్తి, అమ్రాబాద్, బిజినేపల్లి మండలాల్లో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్లు స్వీకరించే క్లస్టర్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు.


