ఎన్నికల నియమావళి పక్కాగా అమలు..
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కలెక్టర్ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఉదయం 10 గంటలలోగా ఫార్మా–1 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసి.. ఆర్‌ఓ కార్యాలయంతో పాటు సంబంధిత గ్రామపంచాయతీల్లో ప్రకటించాలని ఆదేశించారు. 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 1న అప్పీల్, 3న అభ్యర్థిత్వం ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్లను క్లస్టర్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే 780 పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓలు ముందుగానే పరిశీలించి.. వాటిలో కనీస మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌ల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత నోడల్ అధికారులదేనని అన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు ఎవరిని అనుమతించబడదని.. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే ఆర్‌ఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నోడల్ అధికారులు డీపీఓ శ్రీరాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్, సీపీఓ సంధ్యారాణి, డీఈఓ రమేశ్ కుమార్, లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్, డీటీఓ చిన్న బాలునాయక్, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, డీవైఎస్‌ఓ సీతారాం నాయక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాజేందర్‌సింగ్, జిల్లా సర్వేయర్ నాగేందర్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదగిరి, ఎస్‌బీ సీఐ కనకయ్య తదితరులు ఉన్నారు.


