సమస్యలపై నేరుగా సంప్రదించండి : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పలు విభాగాలను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శాంతిభద్రల సమస్యలు తలెత్తకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ సీఐ ఉపేందర్‌రావు, ఎస్బీ ఎస్‌ఐ పర్వతాలు తదితరులున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
కందనూలు: జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్టిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ పోస్టు ఒకటి ఖాళీగా ఉందని, సోషల్ సైన్స్, లైఫ్‌సైన్స్, న్యూట్రిషన్, మెడిసిస్ హెల్త్, సోషల్ వర్కర్, రూరల్ మెనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 35 ఏళ్లలోపు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు) ఉండి మూడేళ్లు ఎన్‌జీఓ, గవర్నమెంట్‌లో అనుభవం కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హత, చిరునామాతో వచ్చేనెల 2లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికే ప్రజాబాట
నాగర్‌కర్నూల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఎస్‌ఈ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని హౌసింగ్ బోర్డులో విద్యుత్ సిబ్బంది చేస్తున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ సరఫరా విషయంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాని కోరారు. వారంలో మూడు రోజులపాటు మంగళవారం, గురువారం, శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సమస్యల విషయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే సిబ్బంది వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్‌శెట్టి, ఎస్‌ఏఓ పార్థసారధి, ఏఈ మాన్యనాయక్, లైన్‌మెన్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు కాళ్ల నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంపూర్ణంగా బీసీ వర్గాలను అణగదొక్కేలా ఉందని ఆరోపించారు. జిల్లాలోని 460 సర్పంచ్ స్థానాల్లో బీసీల వాటాగా 61 స్థానాలు కేటాయించడం దుర్మార్గమన్నారు. బీసీలు జనాభాలో 50 శాతం పైగా ఉన్నా సర్పంచ్ స్థానాల్లో 13 శాతం కేటాయించడం అన్యాయమని విచారం వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సర్పంచ్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 442, సమాంతరం కాల్వ నుంచి 75 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875, వివిధ ఎత్తిపోతలకు 218 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
సమస్యలపై నేరుగా సంప్రదించండి : ఎస్పీ
సమస్యలపై నేరుగా సంప్రదించండి : ఎస్పీ


