సర్కారు బడులపై దృష్టి
● క్లీన్ అండ్ సేఫ్ 5.0 పేరుతో కార్యక్రమం
● పాఠశాలల రూపురేఖలు
మార్చేలా ప్రణాళికలు
● పరిశుభ్రత, విద్యార్థుల
రక్షణకు ప్రాధాన్యం
● వచ్చేనెల 5 వరకు కొనసాగింపు
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు రక్షణ చర్యలు, మౌళిక వసతులు మెరుగుపరిచేందుకు క్లీన్ అండ్ సేఫ్ 5.0 పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి పూనుకుంది. పాఠశాల ఆవరణ, మూత్రశాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా చేపట్టే ఈ పనులను వచ్చేనెల 5లోగా పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ఈ పనులను ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ రేవతిరెడ్డి పలు పాఠశాలల్లో పరిశీలించి సూచనలు చేశారు. ఈ మేరకు వచ్చేనెల 5 వరకు పనులు పూర్తయ్యేలా ఆయా పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలు కృషిచేస్తున్నాయి.
భద్రతకు పెద్దపీట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ఈ కార్యక్రమంలో భాగంగా అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 842 ఉండగా.. వీటిలో సుమారు 56 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి పాఠశాలను శుభ్రంగా ఆకర్షణీయంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 5.0 ప్రణాళిక రూపొందించారు. దీనికోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి పనులను కొనసాగిస్తున్నారు. ఈ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, ఒక అసిస్టెంట్ ఇంజినీర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సభ్యులుగా ఉన్నారు. మొదట శిథిలావస్థకు చేరిన, ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించాలని ఎంఈఓలను ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, మూత్రశాలలు, వాటర్ ట్యాంకులు తదితర వాటిని శుభ్రపరుస్తారు. పాత వస్తువులైన బేంచీలు, టేబుళ్లు, పాత కంప్యూటర్లు ఇతరత్ర వస్తువులు మొత్తం ఒకచోట వేస్తారు. సదరు వస్తువులను కమిటీ పరిశీలన చేసి వారు నిర్ధారించిన తర్వాత అమ్మకానికి సిద్ధం చేస్తారు. విద్యుత్ వైర్లు, స్విచ్‌లు తనిఖీ చేసి దెబ్బతిన్న వాటిని మార్చేస్తారు. అయితే ఈ పనులను మొదట ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే మరోమారు ఎక్కడైనా పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయో అన్న విషయాలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో కార్యక్రమాన్ని వచ్చే నెల 5 వరకు ముగించాల్సి ఉంటుంది. ఎక్కడైతే చెత్తాచెదారం లేకుండా పాఠశాల ఆవరణ శుభ్రపరుస్తారో అక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేపడుతారు. ఈ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక సైతం రూపొందించి ఇప్పటికే అధికారులకు అందజేయగా ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి.
సమస్యలు పరిష్కరిస్తాం..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకే ప్రభుత్వం క్లీన్ అండ్ సేఫ్ 5.0 కార్యక్ర మం చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా సమస్యలు పరిష్కరిస్తాం. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు కొన సాగుతున్నాయి. వచ్చే నెల 5 వరకు ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి.
– వెంకటయ్య, సెక్టోరియల్ అధికారి


