అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడాలి
కల్వకుర్తి/ వెల్దండ: మహిళలను కోటిశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తక్షణమే వారి పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో కల్వకుర్తి, వెల్దండ మండలాల మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మహిళలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూ చించారు. అనంతరం కల్వకుర్తి, వెల్దండ మండలాల పరిధిలోని 1,186 సంఘాలకు రూ.1.27 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళలకు దైర్యం వచ్చిందన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందించడంలో ఐకేపీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం వెల్దండ మండలంలోని చెర్కూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. గ్రామంలోని కళాకారులకు డప్పులు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ ఇబ్రహిం, ఎంపీడీఓ వెంకట్రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆనంద్, భూపతిరెడ్డి, రేవతి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, నాయకులు మోతీలాల్, పర్వత్‌రెడ్డి, కృష్ణ, లక్ష్మయ్య, రషీద్, పుల్లయ్య పాల్గొన్నారు.


