దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి
కందనూలు: దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం దివ్యాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవసహాయం మాట్లాడుతూ దివ్యాంగులు క్రీడలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పాలన్నారు. క్రీడా పోటీల్లో చెస్‌బోర్డు, క్యారమ్స్, జావెలింగ్ త్రో, రన్నింగ్, షాట్‌పుట్ తదితర పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, దివ్యాంగుల సంఘాల సభ్యులు శ్రీశైలం, రాజశేఖర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


