లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు ప్రజా సంఘాలతో కలిసి పోరాడుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. లేబర్ కోడ్‌ల అమలును వ్యతిరేకిస్తూ ఆదివారం పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘాల పోరాటంతో 8 గంటల పనిదినాలను సాధించామన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కార్మికుల హక్కులకు భంగం కలిగేలా ఉందన్నారు. పార్లమెంట్‌లో సంఖ్యాబలం ఉందని ఐదేళ్ల క్రితం 29 కార్మిక చట్టాలను రద్దుచేసిన మోదీ ప్రభుత్వం.. బిహార్ ఎన్నికల అనంతరం లేబర్ కోడ్‌లను అమలు చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, శ్రీనివాసులు, బాల్‌రెడ్డి, ఆంజనేయులు, యాదయ్య, చంద్రయ్య, పెద్ద యాదవ్, అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.


