పత్తి రైతు చిత్తు..
నిర్ణీత తేమశాతం
ఉండేలా చూసుకోవాలి..
దళారుల దోపిడీ..
సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తప్పని కొర్రీలు
● తేమశాతం, కపాస్ నిబంధనలతో
కొనుగోలుకు తిరస్కరిస్తున్న అధికారులు
● మిల్లుల వద్ద పత్తి లోడ్‌తో
వాహనాల బారులు
● కఠిన నియమాలతో
ప్రైవేటు దారిపడుతున్న వైనం
●
సాక్షి, నాగర్‌కర్నూల్: పత్తి కొనుగోళ్ల కోసం తెచ్చిన కపాస్ యాప్.. తేమశాతం పేరుతో అధికారుల కొర్రీలతో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు ఆందోళనకు దిగడంతో రెండు రోజులపాటు పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. బుధవారం నుంచి సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభమైనా.. అధిక శాతం పత్తిని అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. పత్తిలో 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తి లోడ్ ఉన్న వాహనాలను వెనక్కి పంపుతున్నారు. దూర ప్రాంతం నుంచి రవాణా ఖర్చులు వెచ్చించి వస్తున్న రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
తేమ పేరుతో కొర్రీలు..
పత్తి లోడ్‌తో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు సంబంధిత అధికారుల నుంచి కొర్రీలు ఎదురవుతున్నాయి. తేమశాతం 12 కన్నా ఎక్కువగా ఉందని.. పత్తి నల్లగా ఉందని తిరస్కరిస్తున్నారు. మిల్లులకు వస్తున్న పత్తిలో అధికభాగం ఇలా కొనుగోళ్లకు తిరస్కరణకు గురవుతోంది. 12 శాతం కన్నా తక్కువ తేమశాతం ఉన్నా ఎవరికీ కనీస మద్ధతు ధర రూ. 8,100 దక్కడం లేదు. తేమశాతం 8 ఉంటేనే మద్ధతు ధర వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా మందికి క్వింటాకు రూ. 7వేల నుంచి రూ. 7,600 వరకే ధర పలుకుతోంది. మిగిలిన వారికి తేమశాతం లేదంటూ తిరస్కరిస్తుంటడంతో ఆందోళన చెందుతున్నారు.
రైతులు పత్తిని ఆరబెట్టి నిర్ణీత తేమశాతం ఉండేలా చూసుకోవాలి. 12 శాతం కన్నా తక్కువగా ఉంటేనే కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్లకు వీలవుతుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– స్వరణ్‌సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి
సీసీఐ పత్తి కొనుగోళ్లను కఠినతరం చేయడం, కపాస్ యాప్ ఇబ్బందుల నేపథ్యంలో రైతులు సీసీఐ కేంద్రాల్లో మద్ధతు ధరకు పత్తి విక్రయించడం కష్టసాధ్యంగా మారింది. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. సీసీఐ తిరస్కరిస్తున్న పత్తిని క్వింటాకు రూ. 5,500 నుంచి రూ. 6వేలకే కొనుగోలు చేస్తున్నారు. పత్తి రేటు నుంచి తూకం దాకా తమదైన శైలిలో దోపిడీకి తెరలేపుతున్నారు.


