చరిత్ర తిరగరాసే కుట్రలు చేస్తున్న మోదీ
అచ్చంపేట: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తూ.. చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. ప్రపంచంలో ఉక్కు మనిషి అనే పేరు కొందరికే ఉంటుందని.. వారిలో దివంగత ఇందిరాగాంధీ ఒకరు అని అన్నారు. ఆనాడు దేశ ప్రజల కోసం గరీబీ హటావో నినాదంతో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి.. భూస్వాముల చెరలోని వేలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగిందన్నారు. పాకిస్థాన్‌పై యుద్ధంచేసి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని కొనియాడారు. బీజేపీ శాఽశ్వత అధికారం కోసం ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్‌ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడంతో పాటు కుల, మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేయాలని చూస్తోందన్నారు. ఓటు చోరీకి పాల్పడుతూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తోందన్నారు. బిహార్‌లో ప్రజలు ఆకాంక్షించిన ప్రభుత్వం రాలేదన్నారు. నెహ్రూ కుటుంబం తమ ఆస్తులు, పదవులు, ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. అలాంటి నాయకత్వం ఏ పార్టీలోనైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనలు, సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. రెండేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి చూపిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 50వేల ఉద్యోగాలు ఇస్తే.. అనతి కాలంలోనే 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. రానున్న మూడేళ్లలో మరో 1.30 లక్షల ఉద్యోగాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనేసామాజిక న్యాయం సాధ్యమన్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తూ, బడుగు బలహీన వర్గాలకు పదవులు, అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. అచ్చంపేట అభివృద్ధిపై డిసెంబర్ 7న నివేదిక అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.గోపాల్‌రెడ్డి, అనంతరెడ్డి, మల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, రామనాథం, రఫీ, నర్సయ్యయాదవ్ ఉన్నారు.
నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు ఎవరూ చేయలే..
కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిన సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్


