మహిళల అభ్యున్నతే ధ్యేయం
● ప్రభుత్వ పథకాలతో
ప్రగతి పథాన పయనించాలి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్: మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై సమీక్షించగా.. స్థానిక కలెక్టరేట్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి హాజరయ్యారు. వీసీ అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను సుస్థిర ఆర్థిక వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి పథాన ముందుకుసాగాలని సూచించారు. కష్టపడి కూడబెట్టిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయొద్దన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన కొనసాగుతుందని.. గ్రామీణ మహిళలను చైతన్యపరిచి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చూడాలని సూచించారు.
● ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు అనేక పథకాలు అందించడంతో పాటు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు ఓనర్లను కూడా చేస్తుందని తెలిపారు.
● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 1,68,104 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు పక్కా ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘంలోని ప్రతి సభ్యురాలికి ఇందిరా మహిళాశక్తి చీరలు అందాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి.. ప్రజాప్రతినిధుల సమక్షంలో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీపీఓ శ్రీరాములు తదితరులు ఉన్నారు.


