ప్రకృతి వ్యవసాయం.. లాభదాయకం
బిజినేపల్లి: ప్రకృతి వ్యవసాయంపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ అన్నారు. బుధవారం పాలెం కేవీకేలో 21వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో ప్రజారోగ్య సంరక్షణతో పాటు రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక చేయుత అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని.. వాటిని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే డబ్బులతో రైతులు వ్యవసాయ పనిముట్లను సమకూర్చుకోవాలన్నారు. పంటల సాగుతో పాటు పెరటి తోటలు, పండ్ల మొక్కలు, కోళ్ల పెంపకం వంటి వాటిపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పాలెం కేవీకే కోఆర్డినేటర్ డా.శ్రీదేవి, డీఏఓ యశ్వంత్‌రావు పాల్గొన్నారు.


