ఎదురుచూపులు
కష్టమైనా.. నష్టమైనా వ్యవసాయ పనుల్లోనే తలమునకలవుతున్నారు రైతన్నలు. ఈ క్రమంలోనే వానాకాలం చివరలో మోంథా తుపాను తీవ్ర నష్టం మిగిల్చినా.. యాసంగి పంటలకు సమాయత్తమవుతున్నారు. అయితే ఇప్పటికే తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి.. ఆర్థికంగా నష్టపోయిన అన్నదాతలు.. ప్రస్తుత రబీ సీజన్ పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వం అందించే రైతుభరోసాపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పంటల సాగుకు వెచ్చిస్తున్నారు.
నాగర్‌కర్నూల్: పెట్టుబడి సాయం అందించి రైతులు సాగు ఖర్చులకు అప్పులు చేయకుండా ఆదుకునేందుకు 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే రైతులు పంటలు సాగు చేసే ముందు నిధులను ఖాతాల్లో జమచేస్తే సాగుకు వాడుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటమి చెందగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇస్తుండగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎకరాకు రూ.15 ఇస్తామని హామీ ఇచ్చింది. గత సీజన్‌లో రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా ఇటీవల వానాకాలం సీజన్‌లో మాత్రం ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. అయితే ప్రస్తుతం యాసంగి పనులకు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం రైతుభరోసాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. రైతులు పెట్టుబడికి డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది.
సాగు అంచనా ఇలా..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 4,59,616 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,82,480 ఎకరాలు, వేరుశనగ 1,32,087 ఎకరాలు, మొక్కజొన్న 1,07,695 ఎకరాలు, మినుములు 20,856 ఎకరాలు, జొన్నలు 2,568 ఎకరాలు, ఇతర పంటలు 13,930 ఎకరాల్లో సాగు అవుతాయని భావిస్తున్నారు. అయితే పంటల సాగుకు సంబంధించి ఖర్చులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడంతో రైతుభరోసానైనా ఖాతాల్లో జమ చేస్తే రైతులకు కొంత ఊరట కలగనుంది. కానీ, ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు కూడా ఎలాంటి కసరత్తు చేపట్టకపోవడంతో ఇప్పట్లో రైతుభరోసా నిధులు వచ్చే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
20 వేల ఎకరాల్లో..
వానాకాలంలో పంటలు సాగు చేసిన రైతులకు చివరలో మోంథా తుపాను తీవ్రనష్టం మిగిల్చింది. పత్తి, వరి పంటలు చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో చాలాచోట్ల నీట ముగిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ యాసంగిలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది.
రైతుభరోసాపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఇప్పటికే యాసంగి పనులు మొదలుపెట్టిన రైతులు
పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం
చివరలో నిండా ముంచిన మోంథా తుపాను
ప్రస్తుత సీజన్‌లో 4.10 లక్షల
ఎకరాల్లో సాగు అంచనా


