ఇక పంచాయితీనే..!
పాత రిజర్వేషన్లతోనే సం‘గ్రామం’
● మంత్రివర్గం నిర్ణయంతో ఆశావహుల పోరు సన్నాహాలు
● బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్‌తో ‘హస్తం’ ముందుకు..
● అదే బాటలోనే కారు, కమలం నడిచే అవకాశం
● ఈ లెక్కన జనరల్ స్థానాల్లో ఎక్కువ శాతం బీసీలకే చాన్స్
● చట్టపరంగా కాకపోవడంతో చిక్కులు తప్పవని నేతల బెంబేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సం‘గ్రామానికి’ అడుగులు పడ్డాయి. డిసెంబర్‌లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీంతో జనరల్/అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఎక్కువ శాతం మేర బీసీలు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. పార్టీ పరంగా అయితే పలు గ్రామాలకు సంబంధించి చిక్కులు, చికాకులు తప్పవని సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్‌లో జీఓ 9 జారీ చేసింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకిస్తలేరని, తామూ సిద్ధమని.. అయితే చట్టబద్ధత అవసరమని ప్రధాన ప్రతిపక్షాల నేతలు చెప్పారు. ప్రస్తుతం జీపీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయగా.. బీఆర్‌ఎస్, బీజేపీ సైతం అదే దారిలో నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.
‘హస్తం’ దారిలోనే ప్రతిపక్షాలు..


