చదువుతోపాటు కళల్లోనూ రాణించాలి
కందనూలు: విద్యార్థులు, యువతీ, యువకులు చదువుతోపాటు వివిధ కళల్లోనూ రాణించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక రంగంలో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని వెలికితీసి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే భవిష్యత్ మరింత బంగారుమయం అవుతుందన్నారు. చదువుతోపాటు క్రీడలు, కళలు, నైపుణ్యాలు సమానంగా పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గతేడాది జాతీయ స్థాయి పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులను అభినందించారు. ఈసారి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నర్సింగ్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలను పరిశీలించారు. జానపద నృత్యాలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సీతారాంనాయక్, డీఈఓ రమేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ రవినాయక్, జిల్లా సైన్స్ రాజశేఖర్‌రావు, తహసీల్దార్ తబితారాణి, విద్యార్థులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శన
యువజనోత్సవాల్లో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన జానపద నృత్యాలు, సైన్స్ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. జిల్లాకేంద్రంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులు మంచి అలవాట్లు అనే అంశంపై ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే పల్లెటూరి పల్లకిలో పాటకు విద్యార్థులు చేసిన నృత్యం, చిత్రలేఖనం వంటి అంశాలను ప్రదర్శించి అబ్బురపరిచారు.
చదువుతోపాటు కళల్లోనూ రాణించాలి


