బీసీ సర్పంచ్ స్థానాలు 704..
● కాంగ్రెస్ శ్రేణులతోపాటు
వెనుకబడిన వర్గాల్లో జోష్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం.. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేయడంతో రాజకీయ పరంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాలపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగింది. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 1,678 గ్రామపంచాయతీలు ఉండగా.. 15,068 వార్డులు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. 704 జీపీల్లో ఆ వర్గానికి చెందిన వారికి సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎవరికి వారు లెక్కలు వేస్తూ ఊహాగానాల్లో మునిగిపోయారు. మరోవైపు వచ్చే నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్, మూడో వారం చివర లేదంటే నాలుగో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. పలువురు ఆశావహులు పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల వారీగా ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో సందడి నెలకొంది. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్రపరిచింది. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లతో పాటు ఓటరు జాబితాలను ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించగా.. మళ్లీ అన్నీ సిద్ధం చేస్తున్నారు.
చట్టబద్ధమైన రిజర్వేషన్లతోనే మేలు: బీసీ సంఘాలు
ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు పార్టీపరంగా 42 శాతం సీట్లు కేటాయించడాన్ని బీసీ సంఘాల నేతలు ఆహ్వానిస్తున్నా.. పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఇందుకు గత సర్పంచ్ ఎన్నికలను ఉదహరిస్తున్నారు. 2019లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ ఉందని.. ఉమ్మడి పాలమూరులో ఈ మేరకు కేటాయించిన వాటితో పాటు జనరల్ స్థానాల్లోనూ వారు గెలిచారని.. మొత్తంగా 38 శాతం మంది బీసీలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం 42 శాతం అమలు చేస్తే 60 నుంచి 70 సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలైతే బీసీ వర్గాలకు కొంత మేర ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లతోనే వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని.. ఈ మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిస్తున్నారు.
బీసీ సర్పంచ్ స్థానాలు 704..


