భూ భారతిని పకడ్బందీగా అమలు చేయాలి
ఊర్కొండ: భూ భారతిని పకడ్బందీగా అమ లు చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. భూ భారతి సదస్సులో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, ఏ దశలో ఉన్నాయో బాధితులకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పీఓటీ కేసులు, భూ సమస్యలు, సాదాబైనామాల ఫిర్యాదులను రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ యూసుఫ్‌అలీ, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు
కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో పత్తి రైతులకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించి పత్తి కొనుగోలు చేపట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తర్నికల్ సమీపంలోని మిల్లులో రైతులకు మద్దతుగా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని భేషరతుగా కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, శ్రీశైలం, గోవర్ధన్, విజయ్‌గౌడ్, సూర్యప్రకాష్‌రావు, మనోహర్‌రెడ్డి, బాలయ్య, జంగయ్య, రవి, దశరథనాయక్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లోబీజేపీ సత్తాచాటుదాం
అచ్చంపేట: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలో బీజేపీ సత్తాచాటుదామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం రాత్రి అచ్చంపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలు తేలుస్తారన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మభ్యపెడుతుందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సమానమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చూసి మురిసిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతూ ఒక సీటు గెలిచినందుకే ఏదో సాధించామని భుజాలు ఎగరవేస్తోందని విమర్శించారు. బిహార్ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
భూ భారతిని పకడ్బందీగా అమలు చేయాలి


