ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
● ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకురూ.50 వేలు డిమాండ్
● రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
గోపాల్‌పేట: ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఏదుల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు డీడీలు కట్టాడు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ త్వరగా ఇవ్వాలని కోరగా విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్‌రెడ్డి రూ.50 వేలు డిమాండ్ చయగా.. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా రూ.20 వేలు ఇవ్వాలని ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చిన తర్వాత మిగతా రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు మంగళవారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రైతు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈని అదుపులోకి తీసుకున్నామని, బుధవారం నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఇద్దరు సీఐలు, పది మంది సిబ్బంది పాల్గొన్నారు. కాగా..ఏఈ హర్షవర్ధన్‌రెడ్డి స్వగ్రామం అమరచింత మండలం కొంకన్వానిపల్లిలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విలువైన డ్యాకుమెంట్లతో పాటు నగదును సేకరించినట్లు అధికారులు తెలిపారు.


