అక్రమాలకు కళ్లెం పడేనా?
తెలంగాణ స్టోన్ క్రషర్ నియమావళి–2025 అమలు
● మ్యానువల్ విధానానికి స్వస్తి.. ఆన్‌లైన్‌లోనే అనుమతులు
● ఇక నుంచి ఖనిజ
వినియోగంపై ప్రత్యేక దృష్టి
● క్వారీల్లో సీసీ కెమెరాలు.. ఏడీ కార్యాలయానికి అనుసంధానం
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలకు ఆదేశం
ఇప్పటి వరకు
నామమాత్రంగానే..
జిల్లాలో నడుస్తున్న క్రషర్ పరిశ్రమలు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కంకర తయారు చేసి సొమ్ము చేసుకుటున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకపోగా, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు. హెవీ బోల్డర్ క్రషర్‌లు గంటకు 150 టన్నుల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవి జిల్లాలో ఉన్నాయి. ఇది 20 ట్రిప్పర్ల లోడ్‌లకు సమానం. ఇప్పటి వరకు నిర్వాహకులు మ్యానువల్ పద్ధతిలో రాయి వినియోగం వివరాలు ప్రభుత్వానికి సమర్పించేవారు. దీంతో నామమాత్రంగా చూపుతూ సీనరేజ్ చార్జీలు చెల్లింపు పరంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టేవారు. సర్కారు తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అక్కడే వేబ్రిడ్జి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాయి తూకంతోపాటు విద్యుత్ వినియోగం ఆధారంగా లెక్కలు ఇక ఆన్‌లైన్‌లో తేటతెల్లం కానున్నాయి.
అచ్చంపేట: స్టోన్ క్రషర్ యూనిట్లలో విద్యుత్ వినియోగం ఆధారంగా ఇక ఖనిజ వినియోగ నిష్పత్తి అంచనా వేస్తారు. ప్రతి టన్ను ముడి ఖనిజం ఉత్పత్తికి 4 కేవీఏహెచ్ విద్యుత్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ వినియోగ సమాచారం టీఎస్‌పీడీసీఎల్/ ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ పోర్టల్‌తో లింక్ అవుతుంది. డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుదుత్పత్తి జరిగితే దానికి కూడా మీటర్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కల ఆధారంగా సదరు క్వారీలో వినియోగించిన యూనిట్లను లెక్కగడుతారు. ఈ నిబంధనలను పాటించని క్రషర్లకు విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తారు. అలాగే సొంత వే బ్రిడ్జిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. క్రషర్ చేయబోయే రాయి తూకం ఆటోమేటిక్‌గా కంప్యూటర్ సిస్టంలో రికార్డు అయ్యేలా చేయాలి. ఈ రెండు అంశాల ఆధారంగా యూనిట్‌లో ఎంత ఖనిజం వినియోగం జరుగుతుంది.. క్రషర్ ద్వారా ఎంత ప్రొడక్షన్ వచ్చింది.. అనే లెక్కలపై స్పష్టత ఉంటుంది. ఇప్పటి వరకు క్రషర్ యూనిట్ల వద్ద ఎంత ఖనిజం వినియోగంపై యజమాని చెప్పిందే వేదంగా ఉండేది. విద్యుత్ వినియోగాన్ని అసలు పరిగణలోకే తీసుకునేవారు కాదు. అన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా మ్యానువల్ పద్ధతిలోనే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే అక్రమాలకు కళ్లె వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టోన్ క్రషర్ నియమావళి–2025ని అమలులోకి తీసుకొస్తూ ఈ నెల 1న జీఓ 26 జారీ చేసింది. ఈ విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొనసాగనుంది.
మూడేళ్లపాటు నిషేధం..
జిల్లాలో 24 కంకర క్రషర్ పరిశ్రమలు నడుస్తున్నాయి. ప్రతి నెలా 10లోగా ఫాం–ఏ (విద్యుత్), ఫాం–బీ (ముడిసరుకు) వినియోగానికి సంబంధించి రిటర్న్‌లు ప్రభుత్వానికి సమర్పించాలి. వరుసగా రెండు నెలలు రిటర్న్స్ సమర్పించకపోతే క్రషర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా నియమావళి రూపొందించారు. అలాగే పర్యావరణ నియమావళి తప్పనిసరి పాటించాలి. వాటి గడువు ముగిసిన పక్షంలో మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. ప్రభుత్వానికి బకాయిలు ఉండరాదు. ఒకసారి యూనిట్ రద్దు అయితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేయడానికి మూడేళ్లపాటు నిషేధం విధించారు.
అవగాహన కల్పిస్తున్నాం..
స్టోన్ క్రషర్ యూనిట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం కొత్త నియమావళిని రూపొంచించింది. దీనిపై జిల్లావ్యాప్తంగా ఆయా యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా మార్పులను యూనిట్ల వద్ద చేపట్టాలి. బయటి నుంచి గ్రానైట్ తరలించకూడదు. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి.
– వెంకట్రాములు, గనుల శాఖ ఏడీ


