డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు పూర్తిచేయాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన అసంపూర్తి పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసి, డిసెంబర్‌లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనుల పెండింగ్ వివరాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న డిసెంబర్‌లోగా గృహాల ప్రారంభోత్సవం చేపట్టనున్నందున మిగిలి ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన, నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేలా అధికారులు జాబితా సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ డిపో వద్ద నిర్మితమైన 195 ఇళ్లలో విద్యుత్ సౌకర్యం, ప్లంబింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నందున, వాటిని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రధాన రహదారి నుంచి ఇళ్ల వరకు చేరుకునేలా రహదారి పనులు చేపట్టాలని, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వాతావరణం కల్పించాలని పంచాయతీ రాజ్ అధికారులను కోరారు. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, పచ్చదనాన్ని పెంపొందించాలని, అక్కడ నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, గృహ నిర్మాణ శాఖాధికారి సంగప్ప, పంచాయతీరాజ్ ఈఈ విజయ్‌కుమార్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 48 అర్జీలు
నాగర్‌కర్నూల్: రాష్ట్ర, జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది బాధితులతో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరిగా చేయాలని, పరిశీలన అనంతరం ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులకు స్పష్టమైన, పారదర్శకమైన సమాధానం ఇవ్వాలన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు
5 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజవాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సూచించారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలు వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని కోరారు.


