నల్లమలలో ఆలయాల అభివృద్ధికి కృషి
అచ్చంపేట రూరల్: నల్లమల ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపనాశిని గుండం వద్ద పుణ్యస్నానమాచరించి గణపతి పూజ, శివుడికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించడంతోపాటు పలుచోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ మొదలైన వాటిపైన అధికారులు ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలన్నారు. దేవాలయ ఆవరణలో త్వరలోనే సెల్ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు పట్టణంలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాములునాయక్, పాలకమండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు యువజనోత్సవాలు
కందనూలు: యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జానపద నృత్యం, కథా రచన, పెయింటింగ్, వకృత్వ, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ తదితర అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో జిల్లాకు చెందిన 15 – 29 ఏళ్లలోపు యువతీ, యువకులు పాల్గొనాలని సూచించారు.


