సీసీఐ కొనుగోలు కేంద్రాల నిలిపివేత
కందనూలు: జిల్లావ్యాప్తంగా సీసీఐ ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి స్వర్ణసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ కాటన్ జిన్నింగ్ మిల్లుల విషయంలో విధించిన నిబంధనలను సడలించే వరకు రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు, ప్రైవేటులో కొనుగోలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు, కాటన్ జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురావొద్దని రైతులకు ఆయన సూచించారు.
హాస్టళ్ల విద్యార్థులకు
వనభోజనాలు
కందనూలు: షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని హాస్టళ్ల విద్యార్థులకు స్థానిక బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వనభోజనాలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో వార్డెన్లు విజయకుమార్, రవితేజ, సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు కల్పించాలి
కల్వకుర్తి రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ సాధనలో భాగంగా ఆదివారం కల్వకుర్తిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జిల్లా పరిషత్ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. కార్యక్రమంలో మణికంఠ, సదానందంగౌడ్, రాజేందర్, జంగయ్య, భాస్కర్, గణేశ్, అనిల్ పాల్గొన్నారు.
మైసమ్మ జాతరలో
తగ్గిన భక్తుల రద్దీ
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం వానాకాలం పంటకోతలు, ధాన్యం విక్రయాలు సాగుతుండటంతో పాటు యాసంగి సాగు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వ్యవసాయ పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నం కావడంతో మైసమ్మ జాతరలో భక్తుల రద్దీ అంతంతమాత్రంగా కనిపించింది. సుమారు 8వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామ్ శర్మ తెలిపారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల నిలిపివేత


