సాంకేతిక పరిజ్ఞానం అవసరం
కందనూలు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి ప్రాథమిక దశలోనే కంప్యూటర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయాలను సైతం సాంకేతికపరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా స్మార్ట్ లైబ్రేరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి శ్యాంసుందర్, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


