మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
నాగర్‌కర్నూల్: దేశ ఐక్యతను ప్రతిబింబించేలా కృషి చేసిన మహనీయుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా యువతరం ముందుకు సాగాలని ఎంపీ డాక్టర్ పార్మాత్ జయంత్‌సింగ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యత మార్చ్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్, జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి యూనిటీ మార్చ్ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ ఎంపీ డాక్టర్ పార్మాత్ జయంత్‌సింగ్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వళన చేసి.. పటేల్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథులు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించగా.. అంబేడ్కర్ విగ్రహం గుండా గాంధీ పార్క్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎంపీ పార్మాత్ జయంత్‌సింగ్ మాట్లాడుతూ నేడు త్రివేణి సంగమం లాంటి పటేల్, బిర్సా ముండా జయంతి, వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రచన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ఏక్ భారత్– ఆత్మనిర్బర్ భారత్‌శ్రీలో భాగంగా ఐక్యత మార్చ్ నిర్వహించామన్నారు. దేశ సమైక్యత వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారత పౌరుని బాధ్యత అన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం విలీనంలో పటేల్ పాత్ర అమూల్యం అన్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టి దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ పటేల్ దేశ సమైక్యతకు అనేక రకాల పోరాటాలు చేశారని, అలాంటి మహనీయునికి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏక్తా విగ్రహాన్ని ఇటీవలే తాను సందర్శించానన్నారు. అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు, యువతతో దేశ ఐక్యత సమగ్రత, భద్రతను కాపాడటానికి కృషి చేస్తానని రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యూత్ అధికారి కోటనాయక్, జిల్లా యువజన సర్వీసుల అధికారి సీతారాంనాయక్, డీఈఓ రమేష్‌కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ రవినాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్ పాల్గొన్నారు.


