ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలి
గురుకుల పాఠశాల పరిశీలన
కల్వకుర్తి టౌన్: రైతులను ఇబ్బంది పెట్టకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని పూర్తి పారదర్శకంగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెప్మా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అందించి వారిని ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే వరి సన్నాలకు మద్దతు ధర కంటే అదనంగా రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. రైతులు ఎక్కడా దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే ధాన్యం అమ్మాలన్నారు. కేంద్రాన్ని నిర్వహించే వారు సైతం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, తూకాలను సరిగా వేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, పీసీబీ మెంబర్ బాలాజీసింగ్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని గెస్ట్ ఫ్యాకల్టీ కొట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారులు, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాణితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, మరోమారు విద్యార్థుల పట్ల ఎవరైనా కఠినంగా ప్రవర్తించినా, మరేమైనా ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.


