నేడు అచ్చంపేటలో ఉచిత సామూహిక వివాహాలు
అచ్చంపేట రూరల్: నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్ గోపిశెట్టి శివ (అప్ప శివ) ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థకం ఉచిత సామూహిక వివాహాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే కల్యాణ మండపం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు 63 జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటి వరకు అచ్చంపేటలో ఉచిత సామూహిక వివాహాలు చేసిన దాఖలాలు లేవు. కౌన్సిలర్ శివ, గాయతి దంపతులు ముందుకు రావడంతో పేద జంటలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉచిత సామూహిక వివాహాల ఏర్పాట్లు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణం నలు మూలలా స్వాగత తోరణాలు, విద్యుత్ లైట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, అనురాధ దంపతుల సమక్షంలో జరగనున్న ఉచిత సామూహిక వివాహాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, సినీ యాక్టర్లు హాజరు కానున్నారని తెలిసింది.


