ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు | - | Sakshi
Sakshi News home page

ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు

Nov 14 2025 8:42 AM | Updated on Nov 14 2025 8:42 AM

 ఏటేట

ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు

పన్నుల వసూళ్లకు పరుగులు పెడుతున్న అధికారులు, సిబ్బంది

జనరల్‌ ఫండ్‌తోనేసిబ్బంది జీతాల చెల్లింపులు

అభివృద్ధి పనులు అంతంత మాత్రమే..

వనరులను

వినియోగించుకోని వైనం

నిధులు లేక నీరసించిపోతున్న మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి స్టాంప్స్‌ డ్యూటీ, ఆస్తిమార్పిడి రుసుము బకాయి నిధులను ఈఏడాది జనవరిలో విడుదల చేసింది. 2019 నుంచి స్టాంప్స్‌ డ్యూటీ, 2022 నుంచి ఆస్తి మార్పిడి రుసుముకు సంబంధించి నాగర్‌కర్నూల్‌కు రూ. 5.13కోట్లు, అచ్చంపేటకు రూ. 2.12కోట్లు, కల్వకుర్తికి రూ. 6.17కోట్లు, కొల్లాపూర్‌కు రూ. 1.22కోట్లు వచ్చాయి. ఈ నిధులను ప్రత్యేక ఖాతాల్లో జమచేస్తూ.. మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు, కరెంటు బిల్లుల చెల్లింపులకు మాత్రమే వాడుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. సీసీరోడ్లు, వీది లైట్లు, డ్రెయినేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవద్దని స్పష్టంచేసింది. అయితే అచ్చంపేటతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ నిధులను వినియోగించకుండా జనరల్‌ ఫండ్‌ ద్వారానే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ నిధులు మున్సిపల్‌ ఖాతాల్లో మూలుగుతున్నాయి.

అచ్చంపేట: మున్సిపాలిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పట్టణ ప్రజల నుంచి పన్నులు వసూళ్లు గాక ఏటేటా బకాయిలు పేరుకుపోతున్నాయి. స్థానికంగా వస్తున్న ఇంటి పన్నులు ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోవడం లేదు. ఏ చిన్న అభివృద్ధి పని చేపట్టాలన్నా.. మున్సిపాలిటీల్లో నిధులు ఉండని పరిస్థితి నెలకొంది. పన్నుల వసూలు కోసం అధికారులు, సిబ్బంది ఇంటింటికీ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కాలనీల్లో కనీసం డ్రెయినేజీ, సీసీరోడ్లు నిర్మించని మున్సిపాలిటీలకు పన్నులు ఎందుకు చెల్లించాలనే సమాధానం ప్రజలు నుంచి ఎదురవుతోంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అవీ వస్తేనే వార్డుల వారీగా కేటాయింపులు చేసి.. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు తదితర పనులు చేపడుతున్నారు. ఇలా అయితే మరో 20 ఏళ్లయినా పట్టణాలు అభివృద్ధికి నోచుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అంతా ఇష్టారాజ్యం..

అచ్చంపేట మన్సిపాలిటీలో పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు తీసివేయడం.. తీసుకోవడం పరిపాటిగా మారింది. జనాభా ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులు, తాత్కాలిక సిబ్బంది ఉండాలి. అచ్చంపేటలో మాత్రం ఎమ్మెల్యే చెప్పారని కొందరిని.. కౌన్సిలర్లు చెప్పారని మరికొందరిని నియమిస్తుండటంతో ఖజానాకు గండి పడుతోంది. 2011 జనాభా ప్రకారం పట్టణంలో 28,163 జనాభా ఉంది. పెరిగిన జనాభా ప్రకారం 35వేలు ఉంటుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం ఇక్కడ 60 నుంచి 70 మంది కార్మికులు, సిబ్బంది సరిపోతారు. కానీ 113 మంది పనిచేస్తున్నారు. అదనంగా ఉన్న కార్మికులకు ప్రతినెలా రూ. 6లక్షల నుంచి రూ. 8లక్షల వరకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది జీతాలు ఇవ్వడమే గగనంగా మారిన పరిస్థితుల్లో కాలనీల్లో అభివృద్ధి పనులు ఎలా చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వాపోతున్నారు.

అచ్చంపేట మున్సిపాలిటీ

వార్డు అఫీసర్లు, అసిస్టెంట్‌ బిల్లు కలెక్టర్లు ఇలా..

జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో 24 మంది వార్డు ఆఫీసర్లకు గాను 15 మంది రెగ్యులర్‌, 9మంది ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. అసిస్టెంట్‌ బిల్లు కలెక్టర్లు 16 మంది ఔట్‌ సోర్సింగ్‌పై కొనసాగుతున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీల్లో 20 వార్డులకు గాను 6మంది వార్డు ఆఫీసర్లు రెగ్యులర్‌, 6మంది అసిస్టెంట్‌ బిల్లు కలెక్టర్లు ఔట్‌ సోర్సింగ్‌పై పనిచేస్తున్నారు. ఏబీసీలు మినహా వార్డు ఆఫీసర్లు వార్డులకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారు కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. కొల్లాపూర్‌లో 6మంది రెగ్యులర్‌ వార్డు అఫీసర్లు, ఒకరు ఔట్‌ సోర్సింగ్‌ ఏబీసీ పనిచేస్తున్నారు. ఏడుగురితో పట్టణంలో బిల్లులు వసూళ్లు చేస్తున్నారు. కల్వకుర్తిలో 22 వార్డులకు గాను 10 మంది రెగ్యులర్‌, ఏసీబీలు రెగ్యులర్‌ ఒకరు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఐదుగురు పనిచేస్తున్నారు.

సకాలంలో ఆస్తిపన్ను చెల్లించాలి..

పట్టణ ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి తోడ్పాటునందించాలి. సకాలంలో చెల్లించపోతే అదనపు రుసుం పడుతుంది. పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న వారికి నోటీసులు ఇస్తున్నాం. ప్రభుత్వ భవనాల నుంచి ఎక్కువ పన్నులు రావాల్సి ఉంది. ఈఏడాది భువన్‌ యాప్‌, అసెస్‌మెంట్స్‌ పెరగడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయ వనరులు పెరిగాయి. స్టాంప్స్‌ డ్యూటీ నిధులు వాడుకోవాలంటే జీతాలు చేసి పంపించిన 15 రోజుల తర్వాత జీతాలు రావడం వంటి కారణాల వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉండటంతో జనరల్‌ ఫండ్‌ వినియోగిస్తున్నాం.

– మురళి, మున్సిపల్‌ కమిషనర్‌, అచ్చంపేట

 ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు 1
1/2

ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు

 ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు 2
2/2

ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement