భూ సేకరణ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● అధికారులు
సమన్వయంతో పనిచేయాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
పత్తి కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం
తెలకపల్లి: పత్తి కొనుగోళ్లలో జాప్యం చేయడంపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు సమీపంలోని వినాయక కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ, ఆన్‌లైన్‌లో రైతుల వివరాల నమోదు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సకాలంలో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కేంద్రానికి పత్తిని తీసుకొచ్చిన రోజే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. పత్తి కొనుగోలులో ఆలస్యం చేస్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే ల్యాబ్ టాప్‌లను ఉపయోగించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జాకీర్ అలీ, సీసీఐ అధికారి దీపక్, పవన్ ఉన్నారు.
నాగర్‌కర్నూల్: జిల్లాలో చేపడుతున్న 167కే జాతీయ రహదారితో పాటు డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి భూ సేకరణ ప్రక్రియపై ఆర్డీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రెవెన్యూ, సాగునీటి ప్రాజెక్టుల, జాతీయ రహదారి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూ సేకరణలో ఎలాంటి సమస్యలు లేకుండా వేగవంతంగా పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు సురేశ్, జనార్దన్‌రెడ్డి, భన్సీలాల్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణ, కార్తీక్ ఉన్నారు.
● అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండారెడ్డిపల్లికి నూతనంగా మంజూరైన అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ, పనుల ప్రారంభం, ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తి తదితర అంశాలపై కలెక్టరేట్‌లో గ్రామ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. కొండారెడ్డిపల్లిలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.


