ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
పెంట్లవెల్లి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని.. ఎవరై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్, గోప్లాపురం, సింగవరం, కొండూరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ అందించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుచేసి.. రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలన్నారు. కాగా, జటప్రోల్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ యాదవ్, రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, కబీర్, ధర్మతేజ, గోపాల్, శ్రీను పాల్గొన్నారు.


